తెలుగు లో నా బ్లాగు

Friday, November 30, 2007

మంచి వాక్యములు

ప్రయత్నం చేసి ఓడిపో ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు.

సముద్ర కెరటం నాకు ఆదర్శం, లేచి లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు.

బాధపడటానికి వంద కారణాలు చూపించిన జీవితానికి నవ్వడానికి వేయ్యికారణాలు ఉన్నాయని నువ్వు చూపించు, నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది.

అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి.

చీకటి లో ఉన్నానని చింత పడకు, దానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు. ఓటమి పొందానని కలత చెందకు, ఓటమినే ఓడించి గెలిచే మార్గాన్ని వెతుకు. నమ్మకం నీ చేతిలో ఒక ఆయుధం, ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళు, విజయం అన్నివేళలా నీ చెంతనే ఉంటుంది.

ఓడిపోయానని నిరాశచెందకు, ఆ ఓటమినుంచే గుణపాఠం నేర్చుకో, విజయానికి దాన్నే మార్గంగా చేసుకో.

Tuesday, November 13, 2007

ఒక సంఘటన ...

తెల్లవారింది... పక్కమీంచి లేవక ముందే ఆ రోజు దైనందిన కార్యక్రమాల చిట్టా తయారు చెయ్యడం మొదలు పెట్టాను. అది వారంతము అవడంతో ఆ చిట్టా లోని మొదటి కార్యం బట్టలు ఉతకడం. వసారాలో విసిరేసిన వార్తా పత్రికను లోపలికి తేవడనికి సింహద్వారం తలుపు తీసాను. ఎదురుగా శునక మహారాజు దర్శనమిచ్చారు. అది మా వీధి లో తిరిగే కుక్కల గుంపులో ఒకటి. ఇది ఒకటవ అంతస్థు లోకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్య పడుతూ దానిని తోలేసాను, అది క్రిందికి దిగిపోవడంతో పత్రికను తీసుకుని లోపలికి వచ్చెసా. బట్టలు తీసుకుని రెండవ అంతస్థుకి బయలుదేరాను. కుళాయి సన్నని ధార రావడంతో ప్రక్రుతిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నాను. వెనక నుంచి ఎవరో లాగినట్లనిపించింది. వెనుకకు తిరిగి చూస్తే, అదే కుక్క మళ్ళా ఇక్కడ ప్రత్యక్షమైంది. ఒకేసారి భయము, కోపము వచ్చాయి. (ఒక్కసారి కుక్కకాటు రుచి చూసాక ఎవరికైనా భయంవేయక మానదనుకోండి) ఒక్కసారి గట్టిగా కసిరాను... కొన్ని అడుగులు వేసి మళ్ళా నా వంక చూస్తోంది ఏదో ఆశగా... ఏదో అయిందని అర్ధం అయింది (కుక్కల అభినయాలని కొంచెం అర్ధం చేసుకోగలననుకోండి...), దాని వెనకాలే వెళ్తే అది చకచకా రెండు అతస్థులూ దిగేసింది, తీరా చూస్తే అక్కడ ప్రధాన ద్వారం మూసేసి ఉంది. అరెరే.. నేను కసిరినంత మాత్రాన, అక్కడ తలుపు వేసి ఉంటే... అది మాత్రం బయటకు ఎలా వెళ్తుంది చెప్పండి... ఇంతకూ అక్కడ తలుపు వేసి ఉంటే అది లోపలికి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నారా!!! ఎక్కువ ఆలోచించకండి... అది రాత్రి ఎప్పుడో తలుపు తీసినప్పుడు లోపలికి వచ్చి వెచ్చగా ఉండేసరికి రాత్రంతా అక్కడే కునుకు తీసింది. ఉదయం మా స్నేహితురాలు బయటకు వెళ్తూ తలుపు వేసి వెళ్లింది. ఇంక బయటకు వెళ్ళడానికి అది ఇన్ని అగచాట్లు పడింది. అందుకే అంటారు నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరి మీదా కోపం తెచ్చుకోకోడదు అని....