తెలుగు లో నా బ్లాగు

Tuesday, April 04, 2006

పాపం జంతు లోకం...

"Man is a social Animal" దానికి మనమేం చేస్తాం! అంది కోతి గంభీరంగా. అక్కడికి మనమంతా science జంతువులమైనట్లు... అంది నక్క ఎకసెక్కంగా. "జోకులొద్దు... matter Serious"... మాటిమాటికి మాటమాటకు మనిషి మనతో compare ఎందుకు చేసుకుంటాడో అర్ధం కాకుండా ఉంది. ఎవడైనా కొద్దిగా బుద్ది తక్కువ పని చేస్తే చాలు "గాదిద కొడకా!" అని తిడుతాడే! గాడిదలకు మెదడు అంత తక్కువ అని అతగాడి ఉద్దేశమా? అంది గార్ధభం కోపంగా.
"మరే... మనకెవరైనా సరే సరిపడకపోతే తెగబడి తిదుతాడు కొండవీటి చాంతాండంత కవిత్వాలు రాస్తున్నారని కదా... 'వాడవాడలందిరిగి వచ్చెడువారలు గోడల గొందులో వొదిగి కూయుచుండెడి' వారినలా గాడిదలతో పోల్చాడు! గాడిదకైతే మాత్రం కైతలు రాకూడదని రూలుందా!" అనింకా ఎక్కించింది నక్క
అందుకేగా... వీడు నా కొడుకని, కందంలో అందనంతగా ఏడ్చిందీ! "గాడిదవి కనుక కాస్తోకూస్తో నీకు కవిత్వాలొచ్చు. మొరగటమే తప్ప మరేమీ ఎరగని ఈ పిచ్చికుక్కేం చేసింది... పాపం, మొన్న తొగాడియా అనే పెద్ద మనిషంతలా తెగబడి ఎగస్పార్టీ వళ్ళనలా ఊరకుక్కలు బోరకుక్కలు సీమకుక్కలని తిట్టి పోయడానికి ...?
అట్లాగే మా పేర్లు పెట్టి ముట్టె పొగరని మనిషి ఎప్పుడూ తిడుతూ ఉంటాడంది పంది కూడా బాధగా. దున్నపోతులాగా మా చేత పని చేయించుకుంటూ ఒళ్ళొంగని వాళ్ళని మళ్ళా దున్నపోతులని దులిపేస్తాడందో ఆబోతావేదనగా.
అందరు నందరే మరియు నందరు నొదరే అని సభలోని వాళ్ళందరినీ కలగలిపి కుక్కలూ, కోతులూ, పందులూ, దున్నలూ, గాడిదలని ఒక కవిగారు తిట్టిపోయటం గుర్తొచ్చి గట్టిగా నిట్టూర్చు కొన్నాయి అభయారణ్యంలో సభతీరిన ఆ జంతువులన్నీ.
మనవాడి తీరే అంత... మన మనవడని చెప్పుకోవటానికే సిగ్గేస్తోందని పక్క కోతితో చెప్పుకు బాధపడిందో పాతకాలం కోతి. వాడొక్కడికే దేవుడు పెద్ద బుర్రిచ్చాడన్న పొగరు కాబోలు వెళ్ళి దేవుణ్ణే అడుగుదాం పదండంది జంభూకం. జిత్తులన్నీ మనిషి తానే చేస్తూ 'జాకాల్' (Jackale) అన్న name ని బద్నామ్ చేస్తున్నడని నక్క అక్కసు.
సమావేశం సమరావేశం చూసి god కూడా గాఢంగా నిట్టూర్చాడు. మడిసి మిడిసిపాటు తనకూ కొత్తకాదు. ఒళ్ళు మండినప్పుడు వాడూ తనన్ విడిచిపెట్టింది లేదు. "తిరిపమానకిద్దరాండ్రా... పరమేశా! గంగ విడుము... పార్వతి చాలున్! అనడం గుర్తుకొచ్చింది. అయినా దెవుడి role లో సర్ది చెప్పడం తన duty కనుక విషయమంతా విని "ఆ తొగాడియా మహాసయుడు తెగనాడేటప్పుడు గాడి తప్పటంలో మహా ప్రావేణుడులే పాలిటిక్సున్నాక ఇలాంటి hothots అప్పుడప్పుడు తప్పవు. ఎన్నికలంటేనే పోలింగు 'బూతులు'. నబూతో నభవిష్యతని నమ్మే సజ్జు రాజకీయాల్లో రోజురోజుకు ఎక్కువౌతోంది కనుకనే నరుల నాలికలకిలా నరాలు తెగిపోతున్నాయి. అశ్లీలమే వాళ్ళసలైన శీలమైపోయింది. అట్లాంటి వాళ్ళ తిట్లనట్లే పట్టించుకొంటే మీకు నిద్ర పట్టదు. థూ... నా బొడ్డనుకోవాలన్నాడు దేవుడు.
"వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళ నొకళ్ళు మెంటలనో, శుంఠలనో ఎంత అన్ప్రింటబుల్లా తిట్టుకున్నా పర్వాలేదు. కానీ మహాప్రభో!... మధ్యలో ఈ కుక్కలనీ, పందులనీ గోలేంది ...! వినటానికే వల్గర్గావుంది... ఈ వానర వారసుడి వరుస చూస్తే మీరింకో అవతారమెత్తాల్సినవసరమున్నట్లుంది" అని జంతువులన్నీ మోరెత్తి మరీ మొరపెట్టుకొన్నాయి.
సరే ముందసలు సందర్భమేంటో కనుక్కుందాం. మానవుడి వాదనా విందాం 'రమ్మ'ని కాకి చేత కబురంపించాడు దేవుడు.
'ఎన్నికలల హడావిడి. ఎక్కడ, టైము గౌరవయాత్రలకే చాలటం లేదు నా తరపున చిలకను పంపిస్తున్నా చర్చించుకోండి' అన్నాడు మనిషి. చిలక మనిషి పలుకులు మొదలు పెట్టింది.
'కుక్కంటే మాకు మక్కువ ఎక్కువే. డాగనగా తిరగేసిన గాడే గదా (DOG-GOD). కనుకనే శునకాన్ని భైరవుడిగా కొలుస్తుంటాం. గ్రామసింహమని గౌరవిస్తుంటాం. ధర్మరాజు తమ్ముళ్ళందరినీ వదిలేసి, ఒక్క కుక్కనే సరాసరి స్వర్గానికందుకేగా తీసుకెళ్ళిందీ! కుక్క పిల్లా... అగ్గిపుల్లా... కాదేదీ కవుల కనర్హం. ఆ మాటకొస్తే మేము ఏ జంతువునీ తక్కువచేసి చూసింది లేదు. పాము మాకు దేవుడు. దశావతారాల్లో జంతువులన్నింటికీ దేవుడి హోదా కల్పించలేదా??? గాడిదైనా 'God the greate' తో సమానమే కదా... పేపరు వాళ్ళుపన్యాసాలు పూర్తీగా వినకుండా చేస్తే మాదా తప్పు! ఇన్ని నిజాలు చెప్పిన తర్వాత కూడా ఇంకా భుజాలు తడుముకుంటామంటే మీ భుజాలు మీ ఇష్టం.
చిలుక పలుకులకు పాము ఫ్లాటయి పోయింది. మనిషినపార్ధం చేసుకున్నందుకు గార్ధభం బాధపడింది. మొసలి కూడా కన్నీరు కార్చింది. కానీ నక్కే... 'ఈ జుత్తులు నాకు కొత్తా! మనిషిని పనిష్ చేయాల్సిందే!' అని వాదనకు దిగింది. ఉడుంది కూడా అదే పట్టు. మనిషితో మాది రక్త సంబంధం మాట పోతుందని దోమ తెలివిగా తప్పుకుంది. మురుగు లేనిదే మాకు మనుగడలేదు నరుడే మా గురుడని ఈగలూ, నల్లులూ పేలు లాంటి కీటకాలప్పుడే ప్రకటించేసాయి. కోడికి మాత్రం కోపంగా ఉంది. నేను కూయటం మానేస్తాను. 'ఘడియ ఘడియ కూయించుకొని ఆకలేసినప్పుడు వేయించుకొని తింటాడు' అంది. 'భోడి కోడి లేకపోతే తెల్లవారదా ఏంది? మాకు బోలెడన్ని గడియారాలున్నయంది' మనిషి తరపున చిలక.
'నేను దున్నటం మానేస్తాను తిండిగింజలు లేక చస్తాడ' ని కాడి కింద పడేసింది దున్నపోతు. 'నీ సాయం లేకపోతే వ్యయసాయం ఆగదులే. మిషన్లతో పనులు నిమిషాల్లో అయిపోతాయంది" మళ్ళీ చిలుక. అడవి నడిమికి చీలింది. గోవులూ, గుర్రాలూ, చిలుకలూ, ఎలుకలూ, నెమళ్ళూ, తేళ్ళూ లాంటివి ఒకవైపు. కాకీ, నక్క, గద్ద, గబ్బిలం లాంటివింకోవైపు.
పులులూ, గొరిల్లాలు చర్చల్ని బహిష్కరించాయి. మనిషి కనపడితే వేసేయటమే మా పాలసీ అని ప్రకటించేసాయి. కప్ప గంటకో వైపు గెంతుతోంది. గోడమీదున్న పిల్లికెటుదూకాలో పాలుపోలేదు. కుక్క ఒక్క ఓటు మీదే గెలుపోటములు తేలిపోయే పరిస్థితులొచ్చి పడిందిప్పుడు. మనిషి నీ master... మాకే నీ ఓటంటూనా చిలక పార్టీ ఒకవైపు'. మాస్టర్ కాదు వాడొట్టి మాన్స్టర్ మాకే నీ ఓటంటూ నక్క ఊళింకోవైపు. అందుకే అంటారు, ప్రతి కుక్కకూ ఓరోజొస్తుందని. పోలింగు ముగిసింది. ఒక్క ఓటు మెజార్టీతో మనిషి ఘనవిజయం సాధించాడు.
'ఛీ... కుక్కబుద్ధి... కనకపు సింహాసనమ్మీద కూర్చోబెడతామన్నా వెనుకటి బుద్ధి పోనిచ్చుకుంది కాదు. తొగాడియాలాంటి వాళ్ళూరికే తిడతారా?' అని చీదరించుకొంది కాకి & co. లోకులు పలుకాకులు. 'శునకం ఓటెలాగూ మనిషికేనని నేనూ అటు దూకేసానే' అని మధన పడింది మార్జాలం. నువ్వటు దూకటం చూసి నేనూ అటే గంతేసా నాఖరి నిమిషం లో అంది కప్ప చప్పచప్పగా.
'మనిషి గెలిచాడు... సంధి చేసుకుంటే మీకే మంచిదని సలహా ఇచ్చి చక్కా పోయాడు దేవుడు. దేవుడి మాట మేరకు రాయభారానికి పోయిన పావురాయెంతకూ తిరిగిరాలేదు, "Thanks మీ gift మహ taste గా ఉందని కబురంపించాడు మనిషి. మనిషంత దుర్మార్గుడు కనుకే నేనటు ఓటెయ్యంది. ఒట్టు... నన్ను నమ్మండని గోల పెట్టింది శునకం. మరి మనిషి గెలవటానికి సాయపడిన ఆ ఒక్క ఓటూ ఎవరిది?! దేవిడికే తెలియాలి. మావాడికి ఓటెయ్యకపోతే వచ్చే జన్మలో నువ్వూ మనిషై పుట్టి రాజకీయాల్లో పడతావని చిలక చెవిలో బెదిరించింది. అదిరిపోయి ఓటెయ్యాల్సొచ్చిందని బురదలో మొహం దాచుకొని మరీ మదన పడుతోంది వరాహమిప్పుడు.
-- కర్లపాలెం హనుమంతరావు

ఈ ప్రకరణము ప్రమీలా రాణి(నా స్నేహితురాలు) చే సేకరించబడింది.


25 అభిప్రాయములు

Post a Comment

<< Home